పిల్లలను ప్రయోజకులు చేయాలంటే వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లలు ఇంట్లో చూసే విషయాలను త్వరగా నేర్చుకుంటారు. అందుకే చిన్న వయసు నుంచే మంచి విలువలు, మంచి అలవాట్లు నేర్పించడం చాలా అవసరం. వీటి వల్ల పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడతాయి.
ఇతరులను గౌరవించడం ప్రతి పిల్లవాడికి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన గుణం. పెద్దలను చూసినప్పుడు నమస్కరించడం, మర్యాదగా మాట్లాడడం వంటి అలవాట్లు నేర్పించాలి. రోజువారీ సంభాషణల్లో ప్లీజ్, థ్యాంక్యూ, సారీ వంటి పదాలను ఉపయోగించమని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు మర్యాదగా ప్రవర్తిస్తే పిల్లలు కూడా అదే అలవాటును అనుసరిస్తారు.
నిజాయితీ మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన గుణం. కొంతమంది పిల్లలు శిక్షకు భయపడి అబద్ధాలు చెబుతుంటారు. అలాంటి సమయంలో ఆగ్రహం చెందకుండా ప్రశాంతంగా తప్పును వివరించాలి. నిజం చెప్పినప్పుడు వారిని అభినందించడం ద్వారా మంచి అలవాటు పెంపొందించవచ్చు. నిజాయితీ ఉన్న పిల్లలు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
బాధ్యతలను నేర్చుకోవడం పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. స్కూల్ బుక్స్, బ్యాగ్స్, స్టేషనరీ వంటి వస్తువులను సర్దుకోవడం, బొమ్మలను వాటి స్థానంలో పెట్టడం వంటి చిన్న పనులను అప్పగించాలి. నీళ్లు తాగిన తర్వాత బాటిల్ నింపడం వంటి అలవాట్లు కూడా బాధ్యతను పెంచుతాయి. ఇలాంటి చిన్న చిన్న పనులను విజయవంతంగా పూర్తి చేసినప్పుడు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
దయ, కరుణ వంటి విలువలు పిల్లలను మంచి మనుషులుగా మారుస్తాయి. ఇంట్లో చిన్న పనుల్లో సహాయం చేయమని ప్రోత్సహించాలి. స్నేహితులకు అవసరమైనప్పుడు తోడుగా ఉండడం నేర్పించాలి. ఇతరులకు సహాయం చేయడం వల్ల సమాజంలో మంచి సంబంధాలు ఏర్పడతాయని వారికి వివరించాలి.
ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఫోన్లు, టీవీలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అందుకే చదువు, ఆటలు, భోజనం, విశ్రాంతి వంటి పనులకు ఒక క్రమబద్ధమైన షెడ్యూల్ (సమయ పట్టిక) ఉండేలా చూడాలి. సమయపాలన వల్ల పిల్లలు క్రమశిక్షణ నేర్చుకుంటారు. ఇది చదువులోనే కాదు, జీవితంలో కూడా విజయానికి దోహదపడుతుంది.
Also Read: దాంపత్య జీవితంలో ఫన్ కోసం మీ భర్తతో సరదాగా ఈ 7 ప్రశ్నలు అడగండి
పిల్లలు ఎక్కువగా చూసి నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు నిజాయితీ, సహనం, గౌరవం వంటి విలువలను తమ ప్రవర్తన ద్వారా చూపించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడడం వల్ల కుటుంబంలో నమ్మకం పెరుగుతుంది. భయపెట్టడం కంటే ప్రేమతో నేర్పించడం మంచి ఫలితాలు ఇస్తుంది.
కేవలం చదువులో రాణించడం మాత్రమే పిల్లల విజయానికి సరిపోదు. మంచి విలువలు, మంచి అలవాట్లు కూడా అంతే ముఖ్యమైనవి. గౌరవం, నిజాయితీ, బాధ్యత, దయ, సమయపాలన వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచే నేర్పిస్తే పిల్లలు ఆత్మవిశ్వాసం కలిగిన మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. చిన్న వయసులో నేర్చుకున్న మంచి పాఠాలు జీవితాంతం వారికి ఉపయోగపడతాయి.