// //
Jagtial district: జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్య జీవిత ప్రయాణం.. ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా అసాధారణం. ఒక సామాన్య కార్మికుడిగా మొదలై.. అంచెలంచెలుగా ఎదిగి, మరణాన్ని కూడా ఒక పండగలా.. ముందుస్తు ప్రణాళికతో స్వీకరించిన ఆయన గాథ ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వేలాది మందిలో ఆయన ఒకరు. దుబాయ్‌లో ఒక సాధారణ కార్మికుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. తన పట్టుదలతో కష్టపడి అక్కడే సొంతంగా ఒక కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగారు. తన ఎదుగుదలతో ఆగిపోకుండా.. తన ప్రాంతానికి చెందిన ఎంతో మంది నిరుద్యోగులకు దుబాయ్‌లో ఉపాధి అవకాశాలు కల్పించి ఆపద్బాంధవుడిగా నిలిచారు.
సాధారణంగా మనుషులు మరణం గురించి ఆలోచించడానికే భయపడతారు. కానీ ఇంద్రయ్య ఆలోచనా భిన్నంగా ఉండేది. తన మరణం తర్వాత పిల్లలు ఇబ్బంది పడకూడదని.. వారికి భారం కాకూడదని ఆయన భావించారు. ఈ క్రమంలోనే 2009వ సంవత్సరంలో.. అంటే సుమారు 15 ఏళ్ల క్రితమే తన సొంత పొలంలో 8 లక్షల రూపాయలతో ఒక అందమైన రాతి సమాధిని నిర్మించుకున్నారు.
ఆ సమాధిని ఆయన కేవలం ఒక కట్టడంగా చూడలేదు. ప్రతిరోజూ అక్కడికి వెళ్లి.. తన కోసం తాను నిర్మించుకున్న ఆ స్థలంలోనే ధ్యానం చేసుకునేవారు. మరణాన్ని ఒక అనివార్య సత్యంగా అంగీకరిస్తూ.. దాని కోసం మానసికంగా సిద్ధపడటం ఆయన ప్రత్యేకత. ఇటీవల అనారోగ్యంతో శనివారం ఆయన కన్నుమూశారు. ఆయన ముందుగా కోరుకున్న విధంగానే కుటుంబ సభ్యులు ఆయన నిర్మించుకున్న రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు.
తానూ నిర్మించుకున్న సమాధిలోనే నిద్రపోవాలన్న ఆయన కోరిక నెరవేరింది. జీవితాన్ని గెలిచి.. మరణాన్ని కూడా గౌరవప్రదంగా ఆహ్వానించిన ఇంద్రయ్య కథ ఇప్పుడు సోషల్ మీడియా, స్థానికంగా చర్చనీయాంశమైంది.
ALSO READ:మహిళల రక్షణే మా ప్రాధాన్యత.. విశాఖ పోలీసుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
తన సమాధిని తనే నిర్మించుకున్న వ్యక్తి
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య అలియాస్ జాన్
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి తిరిగి స్వగ్రామం వచ్చిన ఇందయ్య
తన కష్టార్జితంతో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ఇందయ్య
మరణానంతరం తన పిల్లలకు భారం కాకూడదని రూ.8… pic.twitter.com/eSGD28Y5Xi
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2026