// //
Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్ పురి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలి పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించాడు. తనను ప్రేమించాలంటూ వెంటపడటమే కాకుండా నడిరోడ్డుపై టీచర్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కౌగిలించుకుంటూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో భౌతిక దాడికి సైతం తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
యూపీ మెయిన్ పురి జిల్లా కొత్వాలి ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ప్రైవేటు ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్న ఉపాధ్యాయురాలిని.. ఓ విద్యార్థి నడిరోడ్డుపై అడ్డగించాడు. తనను ప్రేమించాలంటూ బలవంతపెట్టాడు. ఈ క్రమంలో బలవంతంగా లోబరుచుకునేందుకు యత్నించాడు. తనవైపునకు లాక్కొని ముద్దులు పెట్టబోయాడు. దీంతో టీచర్ కు స్టూడెంట్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే తనకంటే వయసులో చిన్నవాడివని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించే ప్రసక్తే లేదని ఉపాధ్యాయురాలు తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన 12వ తరగతి విద్యార్థి.. వెంట తెచ్చుకున్న ఆయుధంతో టీచర్ ముఖంపై దాడి చేశాడు. రెండు పెదవులను కోసేశాడు. అనంతరం ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన టీచర్ ను స్థానికులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
తొలుత బాధితురాలిని మెయిన్ పురి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అగ్రాకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉపాధ్యాయురాలి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలో టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గమనించవచ్చు. ఆమె మెడను బలంగా చేతితో బిగించి పక్కకు బలవంతంగా లాక్కెళ్లడం కూడా సీసీటీవీలో రికార్డు అయ్యింది.
Also Read: Viral Video: పట్టాలపై షాకింగ్ ఘటన.. రైలు ఢీకొట్టకుండానే.. మహిళకు తీవ్రగాయాలు
వీడియోను షేర్ చేసిన ఆరవ్ అనే యూజర్.. సదరు విద్యార్థి చాలా కాలంగా టీచర్ ను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. ఆమె మరో స్కూల్ మారినప్పటికీ, అతడికి కనిపించకుండా వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నిందితుడు వదల్లేదని పేర్కొన్నాడు. సదరు విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరవ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. కాగా, ఘటనపై కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న విద్యార్థిని త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read: Bengaluru Crime: దొంగతనం చేస్తూ చిక్కిన దొంగ.. కుమ్మేసిన ఇంటివాసులు, పోలీసులకు దొంగ ఫిర్యాదు