// //
YS Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి జరిగేది బడ్జెట్ సమావేశాలు కానుండటంతో ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. వివిధ రంగాలకు కేటాయింపులు ఎలా ఉంటాయన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ ఏర్పడింది. అదే సమయంలో మరో అంశంపై కూడా ఏపీలో చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్.. ఆయన పార్టీకి చెందిన 11 ఎమ్మెల్యేలు.. ఈసారి అసెంబ్లీకి వస్తారా? లేదా? అన్న అంశం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
వైసీపీ అధినేత జగన్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న జరిగే గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ్యులందరూ సభకు హాజరుకావాలని వైసీపీ తరపున ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. చివరిగా గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత ఇంతవరకూ సభలో అడుగుపెట్టలేదు. తిరిగి మళ్లీ ఏడాది కాలం తర్వాత జగన్ అండ్ కో సభలో అడుగుపెట్టనుండటం గమనార్హం. అయితే తొలి రోజు సమావేశాలకు మాత్రమే హాజరవుతారా? లేదంటే దానిని మిగతా రోజులకు కొనసాగిస్తారా? అన్న దానిపై వైసీపీ నుంచి స్పష్టత లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో తిరుమల నెయ్యి కల్తీ అంశం తీవ్రస్థాయిలో కాకరేపుతోంది. కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య ఈ విషయంపై ఆరోపణల పర్వం నడుస్తోంది. అటు జాతీయ మీడియా సైతం.. తిరుమల లడ్డు కల్తీ అంశంపై పెద్ద ఎత్తున డిబేట్లు నిర్వహిస్తూ.. జాతీయ స్థాయిలో ఈ వివాదాన్ని చర్చనీయాంశం చేస్తోంది. ఈ నేపథ్యంలో తన హయాంలో జరిగిన కల్తీ అంశం గురించి.. జగన్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇస్తే బాగుంటుందని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గతంలో చెప్పిన విధంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదని సాధారణ మీడియా సమావేశాల్లో పదే పదే చెబుతున్న జగన్.. అదే విషయంపై రాష్ట్ర అసెంబ్లీలోనూ గళం విప్పాలని వైసీపీ శ్రేణులు సైతం కోరుకుంటున్నారు.
అయితే గత అసెంబ్లీ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా జగన్ ఒకరోజు అసెంబ్లీకి వచ్చి.. సంతకం చేసి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గవర్నర్ ప్రసంగం అనంతరం.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అంబటి రాంబాబు అరెస్టు, జోగి రమేష్ ఇంటిపై దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేసే అవకాశముందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వాధినేతలు చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టే అవకాశముందని సమాచారం. ఈ వివాదాల నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పి జగన్ అండ్ కో ప్రకటన విడుదల చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: CNG vs Petrol Car: సీఎన్జీ vs పెట్రోల్.. రోజు వారీ అవసరాలకు ఏ కారు బెస్ట్ అంటే?
సాధారణంగా ఏ సభ్యుడైనా 6 నెలల వరకూ అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం అతడిపై అనర్హత వేటు పడే అవకాశముంది. వైసీపీ అధినేత జగన్.. చివరిగా గతేడాది అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఈసారి అసెంబ్లీకి రాకపోతే.. మరోమారు అనర్హత అంశం చర్చకు వచ్చే అవకాశముంది. అలా జరగకుండా ఉండేందుకు బడ్జెట్ సమావేశాల సందర్బంగా జగన్ అండ్ కో సభకు వస్తున్నారన్న ఆరోపణలను టీడీపీ వర్గం చేస్తోంది. మెుత్తం మీద ఏపీ బడ్జెట్ సమావేశాల కంటే.. జగన్ సభకు వస్తారా? వస్తే ఏం చేస్తారు? అన్న దానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటం గమనార్హం.
Also Read: Sonu Sood: కమెడియన్ రాజ్ పాల్ పరిస్థితి చూసి అడ్వాన్ ఇచ్చిన సోనుసూద్.. ఏమన్నారంటే?