Telangana Tourism: స్వేఛ్చ బ్యూరో: పర్యాటకరంగంలో ప్రభుత్వం నూతన మార్పులకు శ్రీకారం చుడుతుంది. అందుకోసం టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టూరిజం హోటళ్లలో సైక్లింగ్ ను పర్యాటలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంతేగాకుండా పర్యాటక ప్రాంతాల్లో చేపల హంటింగ్, ట్రెక్కింగ్ తీసుకొచ్చి దేశ, విదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రాంతాల చరిత్రను వివరించేందుకు టూరిజం శాఖలో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ప్రజాప్రభుత్వం టూరిజం శాఖపై దృష్టిసారించింది. పలు పర్యాటక ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. దేశ, విదేశీ పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా మౌలిక వసతులపై దృష్టిసారించింది. అందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంపై ఫోకస్ పెట్టింది. పర్యాటకులకు మధురానుభూతి కలిగించేలా కేరళ, కర్ణాటక, అస్సాం తరహాలో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. అడవిలో కొండలపై నడక (ట్రెక్కింగ్), చెరువు లేదా సరస్సులు, నదుల గట్టున చేపల వేట (ఫిష్ హంటింగ్, యాంలింగ్), అంతేగాకుండా అడవీ ప్రాంతాల్లో సైకిల్ తొక్కడం, పక్షులను చూడటం, సరదాగా సరస్సుల్లో పడలపై ప్రయాణం.. ఇలా అడ్వెంచర్ ను ఇష్టపడేవారి కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. టూరిజం హోటళ్ల వద్ద సైతం సైక్లింగ్ ఏర్పాటుచేయబోతున్నారు. పర్యాటకులకు జలపాతాలు, ఫారెస్ట్పార్కులు, ప్రాజెక్టులు, ఆలయాలు తదితర ప్రాంతాలపై ప్రాధాన్యత వివరించడం, వాటి ప్రాశ్యస్తాన్ని టూరిస్టులకు వివరించేందుకు ప్రస్తుతం ఇతరులపై ఆధారపడటం జరుగుతుంది. ఇతర దేశాల పర్యాటకులు ముందే గైడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇతరులతో సంబంధం లేకుండా టూరిజంశాఖలోని హరిత హోటళ్లలో పనిచే సిబ్బందికే శిక్షణ ఇచ్చి టూరిజం గైడ్లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 25కు పైగా హరిత హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పర్యాటకులకు మౌలిక సదుపాయాలతో పాటు ఆన్ లైన్ బుక్కింగ్ సదుపాయం సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ తోపాటు భద్రాచలం, నాగార్జున సాగర్, వరంగల్, అనంతగిరి, రామప్ప, వేములవాడ, సిద్దిపేటలాంటి పర్యాటక ప్రదేశాలలో హరిత హోటళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 300 మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఆ సిబ్బందిని మల్టీపర్పస్ గా వినియోగించుకోవాలని టూరిజంశాఖ సిద్దమైంది. టూరిస్ట్ గైడ్లుగా తీర్చిదిద్దేందుకు నెల రోజులపాటు వారి ప్రత్యేక శిక్షణను ఇప్పించేందుకు సిద్ధమైంది. టూరిజం ప్రాంతాల చరిత్ర, పర్యాటకులతో ఎలా వ్యవహరించాలి? మన రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి విశిష్టత, ఏ జిల్లాలో ఫారెస్ట్ ఉంది. అక్కడ ఏ జంతువులు, పక్షులు ఉంటాయి.? సేఫ్టీ మెజర్స్ ఇలా పలు అంశాలపై వీరికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. దేశ, విదేశీ పర్యాటకులకు వీరు గైడ్ గా సేవలందించేందుకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీంతో టూరిజంశాఖకు పర్యటకులకు సంఖ్యతోపాటు ఆదాయం సైతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Khammam Politics: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్..?
అనంతగిరి, గోల్కొండ(Golkonda), నాగార్జునసాగర్(Nagarjuna Sagar) ఇలా చారిత్రక కట్టడాలను చూస్తూ ట్రెక్కింగ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు జలపాతాల వద్ద సందడి, నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు, ప్రాజెక్టులు, సరస్సుల వద్ద షిష్ హంటింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు పచ్చని చెట్ల మధ్య సైక్లింగ్ చేసేలా పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. పర్యాటకుల కోసం హరిత హోటల్స్ లోనే సైకిళ్లను అందుబాటులో ఉంచనున్నారు. వారు సాయంత్రం, ఉదయం సమయాల్లోనూ తొక్కేందుకు వీలుగా సౌకర్యం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. వికారాబాద్ అటవీ ప్రాంతం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అమ్రాబాద్ మన్ననూర్ చెక్ పోస్ట్ పరిసరాల్లో సైక్లింగ్ కు అనువుగా ఉంటాయి. మనసుకు ప్రశాంతత కోసం సౌండ్ మెడిటేషన్’ కూడా చేయించనున్నారు. అడవిలో పక్షుల కిలకిలారాగాల మధ్య, ప్రకృతి శబ్దాలను వింటూ ధ్యానం చేసేలా టూరిజంశాఖ ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరస్సుల వద్ద బర్డ్ వాచింగ్, వైల్డ్ లైఫ్ పై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పర్యాటకులు ప్రకృతితో మమేకమయ్యేలా సరికొత్త కార్యక్రమాలకు పర్యాటకశాఖ శ్రీకారం చుట్టబోతుతున్నారు.
పర్యాటకులకు ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సైక్లింగ్, ఫిష్ హంటింగ్, ట్రెక్కింగ్ తోపాటు బర్డు వాచింగ్ సదుపాయాలు కల్పించబోతున్నాం. టూరిస్టులకు ఇబ్బందులు కలుగకుండా వారికి గైడ్ లను సైతం ఏర్పాటు చేయబోతున్నాం. టూరిజంలో పనిచేసే సిబ్బందికే శిక్షణ ఇచ్చి పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పిస్తాం. టూరిజంశాఖ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు సాగుతున్నామని టూరిజంశాఖ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వల్లూరు తెలిపారు.