E-Paper
Advertisement

KTR: 2028లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

KTR: 2028లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్
Advertisement

బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్‌లో ప్రభుత్వ వైఫల్యాలను, రాజకీయ విమర్శలను ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి హక్కులను కాపాడటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని, ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అహంకారపూరిత మాటలతో విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ‘నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడుతున్నావా?’ అంటూ ఎక్స్  వేదికగా సూటిగా ప్రశ్నించారు.

Advertisement

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి తీరును కేటీఆర్ తప్పుబట్టారు. ప్రాజెక్టు గొంతుకోసి, సొంత జిల్లాకే దగా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సోయి లేకుండా, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డిది ఒక కోవర్ట్ బతుకు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అడ్డంగా దొరికిపోయినప్పుడు ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాగడం ముఖ్యమంత్రికి అలవాటేనని ఎద్దేవా చేశారు. నీటి హక్కులపై ప్రభుత్వం చేసిన రాజీని బయటపెడితే తట్టుకోలేక, చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధ్వంసకరంగా సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, వికృత మనస్తత్వంతో చావులు కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి అని విమర్శించారు. ‘నీ సభ్యత, సంస్కారం లేని వాగుడు చూసి జనం చీదరించుకుంటున్నారు’ అని పేర్కొన్న ఆయన, నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు చరిత్రను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించారు. పనికిమాలిన శపథాలు చేయడం, ఆ తర్వాత పత్తా లేకుండా పారిపోవడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.

Advertisement

శాసనసభ లోపల, బయట కాంగ్రెస్ చేస్తున్న జలద్రోహాన్ని ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘మేము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు. రైతన్నల హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం’ అని హెచ్చరించారు. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు ఆడితే ప్రతిసారి సాగవని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు.

సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని.. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. మరో వందేళ్ల దాకా పుట్టగతులు లేకుండా కాంగ్రెస్ పార్టీని పాతేయడం తథ్యమని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ALSO READ: CM Revanth Reddy: బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే.. కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం: సీఎం రేవంత్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×