E-Paper
Advertisement

Jeevan Reddy: జెండా మోసినోడికి టికెట్ లేదు.. వలస వచ్చినోడికి బీ-ఫామ్.. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆవేదన

Jeevan Reddy: జెండా మోసినోడికి టికెట్ లేదు.. వలస వచ్చినోడికి బీ-ఫామ్.. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆవేదన
Advertisement

Jeevan Reddy: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తన దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1984లో కాంగ్రెస్‌లో చేరిన నాటి నుండి నేటి వరకు పార్టీ విజయాల్లో తాను పోషించిన కీలక పాత్రను వివరిస్తూ, ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ధ్వజమెత్తారు. 2019లో బీఆర్ఎస్ ప్రవాహానికి ఎదురు ఈది నిలబడ్డానని, 2014లో ఉత్తర తెలంగాణ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడానని ఆయన గుర్తు చేశారు. శాసనమండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యునిగా తాను అప్పటి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశానని ఆవేదనగా పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదనల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడం దారుణమని మండిపడ్డారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయం తీసుకుని తాను 50 మంది పేర్లను పంపిస్తే, కేవలం 20 మందికే అవకాశం ఇచ్చారని, మిగిలిన టికెట్లను వలస వచ్చిన వారి కోసం కేటాయించారని విమర్శించారు. అసలు గాంధీ భవన్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారని తాను ప్రశ్నిస్తే, తననే క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడిగా చూడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జీవితంలో కాంగ్రెస్ జెండా పట్టని వారికి నేడు బీ-ఫామ్‌లు ఇవ్వడం పార్టీని నమ్ముకున్న వారికి వెన్నుపోటు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, జై భీమ్, జై సంవిధాన్ అంటూ దేశమంతా పాదయాత్ర చేస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం క్రమశిక్షణను తుంగలో తొక్కి రాజ్యాంగ విలువల ఉల్లంఘన జరుగుతోందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనపై ఉన్న వ్యక్తిగత కోపంతో నిబద్ధత కలిగిన కార్యకర్తలకు అన్యాయం చేశారని, రాయికల్ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైందని వాపోయారు. తనను నమ్ముకున్న కార్యకర్తల హక్కులను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో తాను ఉన్నానని, తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్లుగా నేడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి తయారైందని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని వలసవాదులకు ప్రాధాన్యత ఇవ్వడంపై మల్లికార్జున ఖర్గే వంటి అగ్రనేతల దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకువెళ్లినట్లు తెలిపారు.

చివరగా, తన భవిష్యత్ కార్యాచరణపై తన కార్యకర్తలే నిర్ణయం తీసుకోవాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు టికెట్ వస్తే తాను ఎప్పటికీ వ్యతిరేకంగా ప్రచారం చేయనని, కానీ అన్యాయం జరిగిన చోట మాత్రం మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. పార్టీ సింబల్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమేనని, తన కార్యకర్తల కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తానని ప్రకటించారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, కానీ తనను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నది ఒకే పడవ అని, ప్రస్తుతం తలెత్తిన ఈ సంక్షోభానికి కాలమే పరిష్కారం చూపుతుందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement

Read Also: Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×