E-Paper
Advertisement

BJP Nizamabad Meeting: సౌమ్యం.. స్పీడ్ కలిస్తే తిరుగుండదు.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాదే.. ఎంపీ అర‌వింద్

BJP Nizamabad Meeting: సౌమ్యం.. స్పీడ్ కలిస్తే తిరుగుండదు.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాదే.. ఎంపీ అర‌వింద్
Advertisement

BJP Nizamabad Meeting: నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లో శుక్రవారం (మార్చి 6) బీజేపీ పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని ప్రకటించారు. సౌమ్యత, వేగం కలిస్తే తిరుగుండదని.. ఈ కలయికతో పార్టీని అజేయ శక్తిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. ఒకప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండు నెలల పాటు సాగేవని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే తమ సత్తా చాటామని.. రాబోయే ప్రాదేశిక ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

ఎంపీ ఈటల రాజేందర్ ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ, దివంగత నేత డి.శ్రీనివాస్ సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలక పాత్ర పోషించారని.. రాజకీయాల్లో ఆయన అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. పార్టీలో ఉన్న వ్యక్తులు మాత్రమే సీనియర్ లీడర్లు కాదని.. నిరంతరం రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన సీనియర్లని వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తాయని.. ఇక్కడి నుంచే మార్పు మొదలవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని.. ప్రజల విశ్వాసాన్ని ఆ ప్రభుత్వం పూర్తిగా కోల్పోయిందని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఈటల పేర్కొన్నారు.

Advertisement

గత కేసీఆర్ ప్రభుత్వంపై కూడా ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ చేసిన సూచనలను పెడచెవిన పెట్టారని.. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో లక్ష కోట్ల రూపాయల హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. రేవంత్ సర్కార్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారైందని ఎద్దేవా చేశారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిక్కుల్లో పడిందని, జేజమ్మ దిగివచ్చినా ఆ హామీలను నెరవేర్చడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలకు భవిష్యత్తు ఉండదని.. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని మంత్రులు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

తెలంగాణలో మార్పు పవనాలు వీస్తున్నాయని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధిస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ గడ్డపై బీజేపీ జెండా మరోసారి రెపరెపలాడుతుందని, ఇక్కడి విజయమే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపునిస్తుందని అరవింద్, ఈటల పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు.. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Read Also: BRS : కోట్లు, మూటలు.. బీఆర్ఎస్‌కు ఇంకేం కనిపించట్లేదా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×