Airtel 5G: ఎయిర్‌టెల్ తన అన్‌లిమిటెడ్ 5G డేటా వినియోగానికి సంబంధించి నిబంధనలలో కీలక మార్పులు చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ అన్‌లిమిటెడ్ 5G డేటాను మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇతర పరికరాలకు షేర్ చేయడం కుదరదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అటు జాతీయ మీడియాలోనూ దీనిపై కథనాలు రావడంతో ఎయిర్ టెల్ యూజర్లలో గందరగోళం నెలకొంది.
తాము అందిస్తున్న అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్.. కేవలం సదరు మొబైల్ యూజర్ కు మాత్రమే పరిమితమని ఎయిర్ టెల్ ప్రకటించిందంటూ నెట్టింట కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 5G ఫోన్ ఉండి, ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుందని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఫోన్ నుండి హాట్‌స్పాట్ ఆన్ చేసి లాప్‌టాప్ లేదా ఇతర పరికరాలకు కనెక్ట్ చేస్తే.. ఆ డేటా సాధారణ రోజువారీ ప్లాన్ కోటా నుండి కట్ అవుతుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఎయిర్ టెల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే రిలయన్స్ జియో మాత్రం భిన్నమైన వ్యూహంతో దూసుకుపోతోంది. జియో ట్రూ 5G నెట్‌వర్క్ పరిధిలోని వినియోగదారులు తమ మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇతర డివైజ్‌లకు ఎంత డేటా అయినా షేర్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఫోన్ 5G నెట్‌వర్క్‌లో ఉన్నంత వరకు ఎలాంటి అదనపు పరిమితులు లేకుండా డేటాను వాడుకునే అవకాశాన్ని కస్టమర్ కు జియో కల్పిస్తోంది. కాబట్టి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలను మొబైల్ డేటాతో వాడుకునే వారికి జియో ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా మారింది.
కాగా, ఎయిర్‌టెల్ ఫ్యూచర్ లో 5G స్టాండ్‌అలోన్ (5G SA) నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో పడింది. సాధారణ మొబైల్ ప్లాన్‌లను హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రత్యామ్నాయాలుగా మార్చకుండా ఉండేందుకే ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల కోసం ప్రత్యేకంగా ‘ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్’ (FWA) వంటి బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రోత్సహించడమే దీని వెనుక ఉద్దేశమని పేర్కొంటున్నారు. మెుత్తం మీద దీనిపై ఎయిర్ టెల్ నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఎలాంటి నిర్ణయానికి యూజర్లు రాకపోవడమే మంచిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.