Agadha trailer:కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), శ్రవణ్ రెడ్డి(Sravan Reddy), జోవిక విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయా రెడ్డి, ఉల్కా గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ మూవీ అగధ(Agadha). శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ కె ఆర్ సమర్పిస్తున్నారు. ఎమ్మెస్ రాజు (MS Raju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజా మేకర్స్ సినిమాపై అంచనాల పెంచడానికి ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. “అగధ.. అది ఒక మూఢ నమ్మకం అయితే కాదు.. చీకటి లోకంలో నుంచి పుట్టుకు వచ్చిన ఒక శక్తి ” అనే డైలాగ్ తో అగధ ప్రపంచం ఎంత మిస్టీరియస్ గా, ఎంత ఇంటెన్స్ గా ఉండబోతోందో చెప్పేశారు మేకర్స్. మిస్టరీ, దైవిక శక్తుల అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు సిద్ధమవుతున్న ఈ అగధ ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. “మహిమ ఆత్మహత్యకి కారణమేంటో అర్థమైందా? బాబాయ్” అనే ప్రశ్నతో మొదలైన ఈ మిస్టరీ..” నువ్వు, మహిమ కలిసి వెళ్లిన చోటు ఏంటి? అక్కడ ఏం చూశారు?” అనే మరో ప్రశ్నతో మరింత ఆసక్తికరంగా మారుతుంది.అసలు మహిమకు ఏం జరిగింది? ఆమె మరణం వెనుక కారణమేంటి ?వాళ్ళు వెళ్లిన ఆ రహస్య ప్రదేశంలో ఏం చూసారు ?అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్కంఠను ట్రైలర్ మొదటి నుంచే క్రియేట్ చేశారు మేకర్స్.
also read:ప్రైవేట్ పార్టీలో అదరగొట్టేసిన మృణాల్ ఠాకూర్..వీడియో వైరల్!
“మహిమా.. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. ఏం జరిగిందో చెప్పు?” అనే డైలాగ్ కథలోని అతీంద్రియ కోణం తెరపైకి వస్తుంది. ఆ వెంటనే “మంత్ర తంత్ర విద్యలకు అందని ఆసక్తి గురించి నాకు తెలియాలి” అనే డైలాగ్ వినిపించడంతో ఇది సాధారణ హారర్ మూవీ కాదు అనే విషయాన్ని ట్రైలర్లో స్పష్టం చేశారు. అసలు ఆ శక్తి ఏంటి? దానికి అగధ అనే పేరు ఎందుకు వచ్చింది? అనే ఆసక్తిని పెంచుతూ.. “అగధ.. అది ఒక మూఢనమ్మకమైతే కాదు.. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి” అనే డైలాగుతో అసలు కథలోకి తీసుకెళ్లారు. దీనికి కొనసాగింపుగా “అగధ.. నువ్వు ఈ ప్రపంచాన్ని ఏలాలి.. ముల్లోకాల్ని శాసించే శక్తివవ్వాలి” అనే డైలాగ్ రావడంతో అగధ వెనుక ఉన్న శక్తి ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుంది. “తనను చూశాక నా అంతర్దృష్టికి అర్థమయింది ఒకటే..దాని వక్రబుద్ధి” అనే హెచ్చరిక తో.. అగధతో మీ అక్క పెట్టుకుంది.. దానికి మీ ఇద్దరి తలల్ని కానుకగా ఇస్తా” అనే బెదిరింపు కథలోని సంఘర్షణను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఓ ఆ శక్తి వెనుక కారణమేంటి ? ఆ కుటుంబానికి ,అగధకు ఉన్న సంబంధం ఏంటి? అనే మిస్టరీని మాత్రం మేకర్స్ ట్రైలర్ లో రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు.
ముఖ్యంగా ఈ ట్రైలర్లో హైలెట్ గా నిలిచే డైలాగ్స్ విషయానికి వస్తే..” నీ చుట్టూ చెడు చేసే పిచ్చి భూతాలు ఉంటే నా చుట్టూ సృష్టిని నడిపించే పంచ భూతాలు ఉన్నాయి” అనే మాట చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. చెడు శక్తికి ఎదురుగా నిలిచే దైవిక శక్తి ఎంత బలమైనదో తెలియజేసేలా ఉన్న ఈ డైలాగు కథలో జరగబోయే భారీ సంఘర్షణకు సంకేతంగా నిలుస్తోంది. అదే సమయంలో.”ఆ మహాదేవి నీ కుటుంబాన్ని ఏదోలా కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ, అగధ వదలదు” అనే డైలాగు ట్రైలర్ లోని ఉత్కంఠను మరింత పెంచుతుంది.
అడవులు, పురాతన ఆలయాలు, రహస్య ప్రదేశాలు, మంత్ర తంత్రాలు, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక సంకేతాలతో ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ మిస్టిక్ వాతావరణం లో నింపారు. విజువల్స్ కి తోడు ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అగధ ప్రపంచాన్ని మరింత ప్రభావ వంతంగా చూపించాయి. ముఖ్యంగా హీరో శ్రవణ్ రెడ్డి, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పాత్రలు కథలోని మిస్టరీకి కీలకంగా కనిపిస్తున్నాయి.
భయం, ఆందోళన, నిజాన్ని తెలుసుకోవాలనే తపన వంటి భావోద్వేగాలను ఇద్దరు చాలా సహజంగా పలికించారు. ఇతర కీలక పాత్రధారుల ప్రజెంట్ కూడా ట్రైలర్ కి అదనపు బలాన్ని తీసుకొచ్చింది. ట్రైలర్లో కథను చెప్పినట్టే చెబుతూ అసలు రహస్యాన్ని మాత్రం దాచి పెట్టడం విశేషం. అగధ ఎవరు? ఆ శక్తి ఎలా పుట్టింది? మహిమకు ఏం జరిగింది? ఆ కుటుంబాన్ని అగధ ఎందుకు వెంటాడుతోంది ?మహాదేవి వారిని కాపాడగలదా? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.