// //
Nagar Kurnool District: న్యూ ఇయర్ వేళ అందరూ సంబరాల్లో మునిగిపోతుంటే, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కాలనీలో మాత్రం తీవ్ర విషాదం అలుముకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భీమశెట్టి ప్రసన్న (35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు అన్నంలో విషం కలిపి ఇచ్చి, తాను కూడా తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటనలో తల్లి ప్రసన్నతో పాటు ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె మేఘన అక్కడికక్కడే మృతి చెందగా, పదో తరగతి చదువుతున్న కుమారుడు అశ్వితరామ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
అయితే సుమారు రెండు నెలల క్రితం ప్రసన్న భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పటి నుంచి ప్రసన్న తీవ్ర మనస్తాపానికి గురై, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటోంది. చేతికి అందొచ్చిన బిడ్డలు ఉన్నప్పటికీ, భర్త లేని జీవితం తనకు భారంగా అనిపించిందని, ఆయన లేని లోకంలో తాను ఉండలేననే ఆవేదనతోనే ఆమె ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
సంఘటన జరిగిన సమయంలో పిల్లలు ఇద్దరూ స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకల రోజునే ఈ ఘాతుకం జరగడం అందరినీ కలిచివేసింది. అశ్వితరామ్ పరిస్థితిని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి, సోదరిని కోల్పోయి అనాథగా మిగిలిన ఆ బాలుడి పరిస్థితి చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన
సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా లేక కేవలం మానసిక ఒత్తిడి వల్లే ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో తిలక్ నగర్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విషాదం
అన్నంలో పురుగుల మందు కలిపి తిన్న తల్లి, ఇద్దరు పిల్లలు
తల్లి ప్రసన్న.. కుమార్తె మృతి
కొడుకు పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/jxEQCyvvM5
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2026