// // Rani Rudrama Devi: వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది? -->
E-Paper
Advertisement

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?
Advertisement

Rani Rudrama Devi Death Mystery: కాకతీయ సామ్రాజ్యాన్ని అద్భుతంగా బలోపేతం చేయడంతో పాటు ప్రజలను కంటికిరెప్పలా కాపాడిన మహారాణి.. రాణి రుద్రమదేవి. ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి, సువిశాలా సామ్రాజ్యాన్ని స్థాపించి, సుభిక్షపాలన అందించింది. మూడు దశాబ్దాల పాటు పాలన కొనసాగించిన రుద్రమదేవి నల్లగొండ జిల్లా చందుపట్లలోనే మరణించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతకీ ఆమె చివరి గడియలు ఎలా కొనసాగాయి? చందుపట్ల శాసనం చెప్పే రహస్యం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కాకతీయ సామ్రాజ్య చరిత్రలో సుస్థిర స్థానం

కాకతీయ సామ్రాజ్య చరిత్రలో రాణి రుద్రమదేవి పేరు సువర్ణ శాశ్వతంగా నిలిచిపోయింది. భారతీయ చరిత్రలో మహిళా పాలకుల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే మహారాణుల్లో ఆమె ఒకరు. గణపతిదేవుడికి కుమారులు లేకపోవడంతో తన కుమార్తె రుద్రమదేవిని చిన్ననాటి నుంచే యువరాజుగా తీర్చిదిద్దాడు. కత్తిసాము, గుర్రపు స్వారీ, విలువిద్య, యుద్ధ వ్యూహాలు, రాజ్యపాలన వంటి అన్ని అంశాల్లో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అంతేకాదు, పరిపాలనలో అనుభవం పెంచేందుకు ముందుగా మండలాధిపతిగా బాధ్యతలు అప్పగించి, అనంతరం సామ్రాజ్య సింహాసనంపై కూర్చోబెట్టాడు. శాసనాల్లో ఆమెను ‘రుద్రదేవ మహారాజు’, ‘రాయగజకేసరి’ లాంటి బిరుదులతో గౌరవాన్ని పొందింది.

మూడు దశాబ్దాల అద్భుత  పాలన

Advertisement

సుమారు మూడు దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థంగా పాలించిన రుద్రమదేవి, తన ధైర్యసాహసాలతో శత్రువులకు సింహస్వప్నంగా నిలిచింది. యాదవులు, చోళులు, పాండ్యులు, ఇతర సామంత రాజులు కాకతీయ రాజ్యంపై దండెత్తిన ప్రతిసారి ఆమె స్వయంగా యుద్ధరంగంలోకి దిగి విజయాన్ని సాధించింది. అవసరమైనప్పుడు తనలాంటి వేషధారణలో పలువురు యోధులను యుద్ధరంగంలో నిలబెట్టి శత్రువులను అయోమయంలోకి నెట్టే వ్యూహాన్ని కూడా అనుసరించినట్లు చరిత్ర చెబుతోంది. తన పాలనలో ఎంతో మంది రాజులను ఓడించి భారీ పరిహారం పొంది, తన సైనిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఆ సంపదను సైనిక సంక్షేమానికి ఉపయోగించేది.

యుద్ధరంగంలో ఎంత పరాక్రమం చూపిందో, పరిపాలనలో కూడా అంతే దక్షత కనబరిచింది రుద్రమదేవి. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మారువేషంలో గ్రామాలు సందర్శించేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి అనేక చెరువులు తవ్వించింది. మహిళలకు యుద్ధవిద్యల్లో శిక్షణ అందించి, రాజ్య రక్షణలో భాగస్వాములుగా తీర్చిదిద్దింది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కనిపించే కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవం ఆమె కాలంలో మరింత అభివృద్ధి చెందింది. రాజ్యంపై వచ్చిన అంతర్గత తిరుగుబాట్లను కూడా ఆమె సమర్థంగా అణచివేసి, తనకు అండగా నిలిచిన వీరులను ఘనంగా సత్కరించింది.

రుద్రమ మరణం రహస్యం చెప్పిన చందుపట్ల శాసనం

Advertisement

రుద్రమదేవి మరణానికి సంబంధించి చరిత్రలో చాలాకాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఆమె యుద్ధరంగంలో వీరమరణం పొందిందని, మరికొందరు కుట్రకు బలైందని చెప్తుంటారు. అయితే, ఈ సందేహాలకు తెరదించే ఆధారం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో లభించిన శాసనం. ఈ శాసనం ప్రకారం రుద్రమదేవి వరంగల్లు నుంచి పిల్లలమర్రి, ఇనుపాముల మీదుగా చందుపట్లకు చేరుకుని శివారాధన నిర్వహించిన అనంతరం పానగల్లు ప్రాంతానికి వెళ్లింది. అక్కడే క్రీ.శ. 1289 నవంబర్ 27న ఆమె శివైక్యం పొందినట్లు వెల్లడించింది. రుద్రమదేవి మరణాన్ని తేదీతో సహా స్పష్టంగా తెలియజేసే ప్రామాణిక శాసనం ఇదే కావడం విశేషం.

ఈ శాసనాన్ని వేయించింది ఎవరు?

ఈ శాసనాన్ని క్రీ.శ. 1290లో రుద్రమదేవి సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయకుడి భృత్యుడైన పువ్వుల ముమ్మడి వేయించాడు. రుద్రమదేవి, మల్లికార్జున నాయకుడు ఇద్దరి శివలోక ప్రాప్తి కోసం చందుపట్ల సోమనాథ దేవాలయానికి భూమిని దానం చేసిన విషయాన్ని అందులో నమోదు చేశారు. ఒక మహాసామ్రాజ్యాధినేత మరణాన్ని ఓ సాధారణ భృత్యుడు తన భక్తి, గౌరవంతో శాసన రూపంలో శాశ్వతంగా నిలిపివేయడం చరిత్రలో అరుదైన ఘటనగా భావిస్తారు. అందుకే, నేటికీ చందుపట్ల శాసనం రాణి రుద్రమదేవి జీవితానికి, ఆమె చివరి రోజులకు సంబంధించిన అత్యంత విశ్వసనీయ చారిత్రక ఆధారంగా గుర్తింపు పొందింది. తన అసాధారణ నాయకత్వం, అపార ధైర్యం, ప్రజాపాలనలో చూపిన నిబద్ధతతో రుద్రమదేవి తెలుగు జాతి గర్వించదగ్గ మహారాణిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Read Also: అందమైన నీలగిరి.. నల్లగొండగా ఎలా మారింది? చరిత్ర చెప్పే అసలు నిజం ఇదే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×