// //
Minister Ponguleti: ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ , ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.అలాగే రెండవ విడతలో శిధిలావస్ధలో ఉన్న 170 ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని చెప్పారు.
తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం ఉంటుందన్నారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిధిలావస్ధ, పాలనకు అనువుగా లేని భవనాలు వివరాలను సేకరించారు.“ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలి” అని సీఎం ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా రెవెన్యూ కార్యాలయాలు ప్రజలకు సౌకర్యవంతంగా లేకపోవడంతోపాటు చాలా వరకు అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళికాబద్ధత లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించిందని మంత్రి విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.
Also Read: Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మాన్యవర్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే ప్రజలకు దూరంగా కలక్టరేట్‌లను నిర్మించి నిర్వహణను గాలికివదిలేశారని విమర్శించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు.ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పఠాన్ చెరువులలో భవనాలకు శంకుస్థాపన పూర్తయ్యిందని, గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉండి మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
Also Read: Online Betting: జగిత్యాలలో విషాదం.. బెట్టింగ్ యాప్ ద్వారా మరో వ్యక్తి బలి