Harish Rao: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచిన నేపథ్యంలో వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నులు తగ్గించాలని నాడు పీసీసీ హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. ‘ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి ధరలు దించు’ అని హరీశ్ రావు డిమాండ్ చేసారు.
వారం వ్యవధిలో నాలుగు సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని హరీశ్ రావు మండి పడ్డారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే.. మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లు చమురు ధరల పెరుగుదలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభానికి లోను కావడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో.. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
Wrote an open letter to Chief Minister @revanth_anumula demanding an immediate reduction of VAT on petrol and diesel to provide relief to the people of Telangana.
While fuel prices continue to rise and people struggle with inflation and increasing living costs, the Congress… pic.twitter.com/hpAUfRbZkd
— Harish Rao Thanneeru (@BRSHarish) May 25, 2026
రైతులు పొలం దున్నాలంటే డీజిల్ భారం, సామాన్యుడు బైక్ తీయాలంటే పెట్రోల్ భారం.. పెను శాపంగా మారిందని హరీశ్ రావు అన్నారు. పెరిగిన చమురు ధరలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ రేవంత్ ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ సంబర పడుతుందని విమర్శించారు. పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ దుయ్యబట్టారు. పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.2,000 కోట్ల అదనపు వ్యాట్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి చేరనున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
Also Read: Viral Video: 22 ఏళ్లకే ఆరోసారి ప్రెగ్నెంట్.. 5 గురు ఉన్నా మగబిడ్డకోసం ఆరాటం.. డాక్టర్ రియాక్షన్ ఇదే!
ఎన్నికల ముందు వ్యాట్ పై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండున్నరేళ్లుగా కేనీసం 0.1% వ్యాట్ కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక మరొక తీరు వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది నిజంగా ప్రజా పాలనే అయితే వెంటనే పెట్రోల్, డీజిల్‌పై కనీసం 10% వ్యాట్ తగ్గించాలని పట్టుబట్టారు. పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై మొసలి కన్నీరు కార్చే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యాట్ దోపిడీపై స్పందించాలని కూడా హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Also Read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్‌లా మార్చేయండి!