// //
Kiran Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన ‘నీట్’ పరీక్షల అక్రమాల వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఈ లీకేజీ ఉదంతంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తారు. దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై తక్షణమే చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
లోక్‌సభలో వాయిదా తీర్మానం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన నిరసనను గళమెత్తారు. నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సభలో సమగ్రంగా చర్చించాలంటూ ఆయన లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అంశాన్ని పక్కనబెట్టి వేరే చర్చలు జరపడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని తోసిపుచ్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి రాజీనామాకు డిమాండ్
పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కఠినమైన నిబంధనలతో కూడిన వ్యవస్థలో కూడా పేపర్ లీకేజీలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ కోట్ల మంది విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఆయనే బాధ్యత వహించాలన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయి ఉన్నత స్థాయి విచారణ జరిపి, ఇందులో ఎంతటి వారున్నా సరే కఠినంగా శిక్షించాలని ఎంపీ డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ అక్రమాల వల్ల అంధకారంలో పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కేవలం సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకోకుండా, ఈ సమస్యపై పార్లమెంట్‌లో సుదీర్ఘమైన, పారదర్శకమైన చర్చ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఈ పోరాటాన్ని ఆపేది లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.
Also Read: హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!