Kriti Sanon:ఒకప్పుడు మహిళలు సరైన సమయంలోనే వివాహం చేసుకోవాలని.. సరైన సమయంలోనే పిల్లలను కనాలి అనే నిబంధన ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ.. మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే వ్యక్తిగత జీవితానికంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కెరియర్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు నేటి మహిళలు. అయితే పిల్లల్ని కనాలనుకున్నప్పుడు మాత్రం సంతాన సమస్యలు వారిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఇకపోతే కెరియర్ పై ఫోకస్ పెట్టిన మహిళల కోసం కొత్త వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఎవరైతే కెరియర్ కోసం తాపత్రయ పడుతున్నారో.. అలాంటివారు భవిష్యత్తులో సంతాన సమస్యలు ఎదుర్కోకుండా ముందస్తుగానే ఆరోగ్యకరమైన అండాలను దాచిపెట్టుకొని.. అవసరం అనుకున్నప్పుడు వాటితో పిల్లల్ని కనే కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. అటు వ్యాపారవేత్తల నుండి ఇటు సినిమా సెలబ్రిటీల వరకు “ఎగ్ ఫ్రీజింగ్” అనే పద్ధతిని ఉపయోగిస్తున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ భార్య ఉపాసనను మొదలుకొని ఎంతోమంది హీరోయిన్లు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అవలంబించిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలోకి ఇప్పుడు ప్రభాస్ బ్యూటీ కృతి సనన్ కూడా వచ్చి చేరింది. తాజాగా తాను కూడా అండాలను భద్రపరుచుకున్నాను అని చెప్పి , హార్మోన్ చికిత్స వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై కూడా ఊహించని కామెంట్లు చేసింది. ఇటీవలే హిందీలో కాక్ టెయిల్ 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దగుమ్మ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎగ్ ఫ్రీజింగ్ పై స్పందించింది.
also read:బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో ఊహించని ట్విస్ట్.. జడ్జీలలో భారీ మార్పు!
కృతి సనన్ మాట్లాడుతూ..” నేను నా అండాలను భద్రపరుచుకున్న విషయాన్ని మీతో తొలిసారి పంచుకుంటున్నాను . నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. పెళ్లి, పిల్లలు అనేది మనం శారీరకంగా , మనస్పూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే జరగాలి. సమాజం లేదా వయసు ఒత్తిడి వల్ల జరగకూడదు. నిజానికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చులు నేను భరించగలిగినందుకు అదృష్టవంతురాలిని. అయితే ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉండదు. ముఖ్యంగా మిమి సినిమా కోసం నేను బరువు పెరగాల్సి వచ్చినప్పుడు.. ఈ ప్రక్రియ పూర్తి చేశాను.
ఆ సమయంలో హార్మోన్ చికిత్స వల్ల శరీరం ఉబ్బినట్లు అనిపించడం.. బరువు పెరగడం లాంటివి జరిగాయి. అప్పటికే మూవీ కోసం బరువు పెరుగుతున్నందున అదే సరైన సమయం అని భావించి నేను నా ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకున్నాను. నిజానికి ఇదంత సులభం కాదు.. హార్మోన్ల మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్, శారీరక అసౌకర్యం లాంటి ఇబ్బందులు ఎన్నో ఎదురవుతాయి. ఒత్తిడి తట్టుకోలేక పోయాను. అయితే భవిష్యత్తులో పిల్లల విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను” అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే బరువు పెరగడానికి తీసుకున్న హార్మోన్ చికిత్స వల్ల శరీరంలో వచ్చిన మార్పులను ముందే గమనించి ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది కృతి సనన్ . ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.