// //
Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినా కూడా అల్లర్లు ఆగడం లేదు. ప్రధాని రాజీనామా విజయవంతం కావడంతో నిరసన కారులు మిగతా ప్రధాన పదవుల్లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిరసనకారులు సుప్రీం కోర్టు ఆవరణలోకి చేరుకున్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలని లేకపోతే న్యాయమూర్తుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తప్పని పరిస్థితిలో బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. న్యాయమూర్తుల భద్రత దృష్ట్యా తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
హసన్ రాజీనామా తమకు అందిందని పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్‌రుల్ ప్రకటించారు. హసన్ తర్వాత మరో ఐదుగురు న్యాయమూర్తులు కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాత్కాలిక ప్రభుత్వం చట్ట విరుద్దం అని న్యాయమూర్తి ప్రకటించాలని అనుకున్నారని నిరసనకారులు ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే ఢాకా యూనివర్సిటీ వీసీ మక్సూద్ కమల్, ఎస్‌యూఎస్‌టీ వీసీ ఫరీదుద్దిన్ అహ్మద్ కూడా రాజీనామా చేశారు.