// //
Amberpet Tragedy: నగరంలోని అంబర్‌పేట పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను శ్రీనివాస్, అతని భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్యగా గుర్తించారు.
ఈ కుటుంబం గతంలో రాంనగర్ ప్రాంతంలో నివాసం ఉండేది. కొద్ది రోజుల క్రితం వీరి పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన కుటుంబ సభ్యులు, ఆ జ్ఞాపకాల నుండి బయటపడేందుకు అంబర్‌పేటలోని రామకృష్ణ నగర్‌కు ఇల్లు మారారు. అయితే, ఇల్లు మారినప్పటికీ పెద్ద కూతురు మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.
పెద్ద కూతురు చనిపోయినప్పటి నుండి వీరు చుట్టుపక్కల వారితో వింతగా మాట్లాడేవారని తెలుస్తోంది. “దేవుడు పిలుస్తున్నాడు.. మా పెద్ద పాప దగ్గరికే మేము కూడా వెళ్తాము” అని తరచూ అనేవారని స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపం లేదా మూఢనమ్మకంతో ముగ్గురూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. వీరు రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Murder Mystery: మూడు నెలలుగా కనిపించని యజమాని.. కుక్కల మలంలో దొరికినవి చూసి పోలీసులు షాక్!